బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ షో 'ది ట్రెయిటర్స్ సీజన్ 2'లో ఆరో ఎపిసోడ్ చిత్రీకరణ సమయంలో ఈ ఘటన జరిగింది. బిలియర్డ్స్ గదిలో శ్వేతా తివారీ, రియా చక్రవర్తిలతో మాట్లాడుతున్నప్పుడు మల్లికా షెరావత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

శ్వేతా తివారీకి సంబంధాలు కుదిర్చే క్రమంలో, ఆమె కోసం ఒక యూరోపియన్ యువకుడిని వెతుకుతానని, అతను శ్వేతను దేవతలా చూసుకుంటాడని మల్లికా పేర్కొన్నారు. దీనిపై రియా చక్రవర్తి స్పందిస్తూ, భారతీయ పురుషుల కంటే యూరోపియన్ పురుషులే డేటింగ్‌కు ఉత్తమమా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మల్లికా, భారతీయ పురుషుల కంటే యూరోపియన్లే గొప్పవారని సెటైర్ వేశారు.

ఈ సంభాషణకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో నెటిజన్లు మల్లికా షెరావత్‌ను విమర్శిస్తున్నారు. మంచి, చెడు మనుషులు ప్రతిచోటా ఉంటారని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. ఈ వివాదంపై షాలిని పాస్సీ స్పందిస్తూ, మగాళ్ల గురించి చర్చించడం మానేసి ఆటపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ షోలో శ్వేతా తివారీ గతంలో తన భర్తల గురించి చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారకముందే, మల్లికా చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో 21 మంది సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. ఆదిత్వ కులశ్రేష్ఠ, హర్మాన్ సింగ్, రణ్‌వీర్ బ్రార్ వంటి వారు ఇప్పటికే షో నుంచి ఎలిమినేట్ అయ్యారు.