పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీమయి కన్వెన్షన్ హాల్లో సోమవారం రాత్రి సింగరేణి 56వ వార్షిక భద్రతా పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (DGMS) ఉజ్జ్వల్ తాహ్ మాట్లాడుతూ, దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థగా ఉన్న సింగరేణి, భద్రతా నియమాల అమలులో ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.

ప్రమాదాలు లేని బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోవాలని ఉజ్జ్వల్ తాహ్ సింగరేణి యాజమాన్యానికి సూచించారు. భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ఆయన కోరారు. సింగరేణి రెస్క్యూ బృందం అందిస్తున్న సేవలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయని ఆయన గుర్తు చేశారు. పరిశ్రమ అభివృద్ధిలో ప్రతి ఉద్యోగి భద్రతా సంస్కృతిని అలవర్చుకోవాలని, అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో రామగుండం ఏరియా-1 జనరల్ మేనేజర్ డి. లలిత్ కుమార్ స్వాగతం పలకగా, కార్పొరేట్ జనరల్ మేనేజర్ (సేఫ్టీ) కె. సాయిబాబు వార్షిక భద్రతా నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా భద్రతా సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు. భద్రతా పక్షోత్సవాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గనులు, విభాగాలు, అధికారులు మరియు ఉద్యోగులకు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీవై డీజీఎంఎస్ టీ.ఆర్. కన్నన్, సింగరేణి డైరెక్టర్లు కె. వెంకటేశ్వర్లు, ఎం. తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. వెంకన్నతో పాటు పలువురు అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.