భారత్ అగ్రి వ్యవస్థాపకుడు, సీఈఓ సిద్ధార్థ్ డయలాని తన భార్యతో కలిసి గత ఐదేళ్లుగా ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. నగరంలో ఎక్కడ బైక్ పార్క్ చేసినా, హెల్మెట్‌ను లాక్ చేయకుండా సీటు పైనో లేదా సైడ్ మిర్రర్‌పైనో ఉంచి వెళ్తుంటారు. ఇప్పటివరకు ఒక్క హెల్మెట్ కూడా దొంగతనం కాలేదని ఆయన వెల్లడించారు.
బెంగళూరు నగరం ఎంతవరకు నమ్మదగినదో తెలుసుకోవడమే ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశమని సిద్ధార్థ్ పేర్కొన్నారు. దీనికోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేని పద్ధతిని ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు. ఐదేళ్లుగా హెల్మెట్లు సురక్షితంగా ఉండటంతో, బెంగళూరును 'హై-ట్రస్ట్ సిటీ'గా అంటే ప్రజలు ఒకరినొకరు ఎక్కువగా నమ్మే నగరంగా ఆయన అభివర్ణించారు.
అయితే, ఈ ప్రయోగానికి వారు ఒక నిబంధన పెట్టుకున్నారు. ఏ రోజు తమ హెల్మెట్ దొంగతనానికి గురవుతుందో, ఆ ప్రాంతానికి మళ్లీ వెళ్లడం మానేస్తామని సిద్ధార్థ్ చెప్పారు. అంటే, ఒక హెల్మెట్ పోవడం ద్వారా ఆ ప్రాంత ప్రజలపై తమ నమ్మకం పోయినట్లేనని ఆయన భావిస్తున్నారు.
ఈ ప్రయోగంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హెల్మెట్ ధర తక్కువగా ఉండటం వల్లే ఎవరూ దొంగిలించలేదని, ఖరీదైన వస్తువులతో ప్రయత్నిస్తే అసలు విషయం తెలుస్తుందని కొందరు విమర్శించారు. మరికొందరు బెంగళూరులో అన్ని ప్రాంతాలు ఒకేలా ఉండవని, ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు మారవచ్చని అభిప్రాయపడుతున్నారు.








