మటన్ షాపులోకి వచ్చిన కొండచిలువ అక్కడ ఉన్న మేకలను మింగడానికి ప్రయత్నించింది. ఈ దృశ్యాన్ని చూసిన షాపు యజమాని భయంతో పెద్దగా కేకలు పెట్టడంతో, స్థానికులు భయాందోళనకు గురై అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు.
అయితే, మద్యం మత్తులో ఉన్న సురేష్ అనే వ్యక్తి అక్కడికి చేరుకుని పామును పట్టుకున్నాడు. ఎటువంటి రక్షణ లేకుండానే పామును లాగడంతో, అది సురేష్ చేతిని చుట్టుకుని ఒత్తిడి పెంచింది. ఆ సమయంలో పాము సురేష్ చేతిని రెండు మూడు సార్లు కొరికినప్పటికీ, అతను పట్టు వదలకుండా దానిని తన మెడలో దండలా వేసుకున్నాడు.
ఈ ఘటనతో వందల సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సురేష్ పాముతో ఆడుకుంటూ అక్కడి వాతావరణాన్ని సర్కస్ లా మార్చేశాడు.
చివరికి సురేష్ ఆ కొండచిలువను ఒక పెద్ద డబ్బాలో ఉంచి సమీపంలోని కాలువలో వదిలేశాడు. కాలువలో పడిన తర్వాత పాము రెండుసార్లు పైకి లేచి, అక్కడి నుంచి వెళ్ళిపోయింది.








