బంగ్లాదేశ్ జాతీయ సంసద్‌ (దేశ పార్లమెంటు)లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంఘీర్ 255 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. ఆయన ప్రత్యర్థి, నేషనల్ సిటిజన్స్ పార్టీ (NCP) నేతృత్వంలోని 11 పార్టీల కూటమి అభ్యర్థి ఓలీ అహ్మద్‌కు 88 ఓట్లు మాత్రమే లభించాయి. మొత్తం 349 మంది సభ్యులు ఉన్న పార్లమెంటులో, ఒక నియోజకవర్గంలో ఎన్నిక నిలిచిపోవడంతో 343 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

గత 35 ఏళ్లలో బంగ్లాదేశ్‌లో అధ్యక్ష ఎన్నికలు పోటీ లేకుండా ఏకగ్రీవంగా జరిగేవి. అయితే ఈసారి ప్రతిపక్షాలు అభ్యర్థిని నిలబెట్టడంతో ఎన్నిక అనివార్యమైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏఎస్ఎం నాసిర్ ఉద్దీన్ పర్యవేక్షణలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. అనంతరం కమిషనర్ అధికారికంగా ఫలితాలను ప్రకటించారు.

గత నెలలో అప్పటి అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ అనారోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 2023లో బాధ్యతలు చేపట్టిన షహాబుద్దీన్, తన ఐదేళ్ల పదవీకాలం పూర్తికాకముందే జూలై 24, 2026న రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామాను స్పీకర్ హాఫిజ్ ఉద్దీన్ అహ్మద్ ఆమోదించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 54 ప్రకారం తాత్కాలికంగా అధ్యక్షుడి విధులు నిర్వహించారు.

బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవి ఖాళీ అయిన 90 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. ఈ నిబంధన మేరకు గురువారం జరిగిన ఎన్నికలు గడువులోపే పూర్తయ్యాయి. దీంతో తాత్కాలిక అధ్యక్షుడి పాలనకు తెరపడింది. ఎన్నికైన మీర్జా ఫక్రుల్ ఆగస్ట్ 21న అధికారికంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మీర్జా ఫక్రుల్ తన బీఎన్‌పీ (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ) ప్రధాన కార్యదర్శి పదవికి, జాతీయ స్థాయీ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ ఛైర్మన్ తారిక్ రెహమాన్‌తో చర్చల తర్వాతే ఆయన అభ్యర్థిత్వం ఖరారైందని పార్టీ నేత రుహల్ కబీర్ రిజ్వీ తెలిపారు. ఈ విజయంతో ఆయన బంగ్లాదేశ్ 23వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.