నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ పోలీస్ స్టేషన్‌లో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితితో పాటు, పెండింగ్ కేసుల దర్యాప్తు తీరును ఆయన క్షుణ్ణంగా సమీక్షించారు.
స్టేషన్‌లోని రిసెప్షన్, లాకప్ గది, మాల్ఖానా, సీసీ కెమెరాలు మరియు విజిటర్ రిజిస్టర్‌లను ఏసీపీ పరిశీలించారు. పెండింగ్ పిటిషన్ల వివరాలను ఎస్సై శైలేందర్‌ను అడిగి తెలుసుకున్న ఆయన, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి పరిష్కరించాలని ఆదేశించారు. బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంచాలని సిబ్బందికి సూచించారు.
అక్రమ ఇసుక, మొరం రవాణా, గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నిఘా పెంచాలని ఏసీపీ స్పష్టం చేశారు. తరచూ వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
నేరాల నియంత్రణ కోసం గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని, రాత్రి గస్తీని పెంచి బీట్ వ్యవస్థను పటిష్ఠం చేయాలని ఏసీపీ దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే స్నేహపూర్వక పోలీసింగ్‌ను అమలు చేయడం ద్వారా శాంతిభద్రతలను మరింత మెరుగుపరచాలని ఆయన అధికారులకు సూచించారు.








