అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. సోమవారం రాత్రి వరుసగా పదో రోజు ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై అమెరికా దాడులు చేసింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా ఈ దాడులను కొనసాగిస్తోంది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను కూడా అమెరికా లక్ష్యంగా చేసుకుంది.

అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బహ్రెయిన్, కువైట్ దేశాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ దాడుల్లో రెండు దేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు, రాడార్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. కువైట్‌లో విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలపై జరిగిన దాడి వల్ల భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీనివల్ల కువైట్ నీటి సరఫరా వ్యవస్థలో 90 శాతం దెబ్బతిన్నట్లు సమాచారం.

మరోవైపు జోర్డాన్‌పై కూడా ఇరాన్ దాడులు చేసింది. పౌర నిర్మాణాలను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడుల్లో, ఇరాన్ ప్రయోగించిన ఐదు డ్రోన్లు, మూడు క్షిపణులను కూల్చివేసినట్లు జోర్డాన్ సైన్యం తెలిపింది. మరిన్ని డ్రోన్, క్షిపణి దాడులకు సిద్ధంగా ఉండాలని ఇరాన్ హెచ్చరించింది.

యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలోనే శాంతి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇరాన్ మంత్రి ఎస్కందర్ మొమేనీ మంగళవారం పాకిస్థాన్ చేరుకున్నారు. అక్కడ ఆయన పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో సమావేశమయ్యారు. శాంతి స్థాపనపై చర్చలు జరిపినట్లు సమాచారం ఉన్నప్పటికీ, దీనిపై అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడించలేదు.