అన్నపూర్ణ స్టూడియోస్ మరియు ఎపిక్ స్టూడియోస్ కలిసి ఒక వినూత్న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. ‘పళ్ళబురుసు’ పేరుతో రూపొందుతున్న ఈ కామెడీ-డ్రామా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. తెలుగు సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించేలా ఈ సినిమా కథ ఉండబోతోంది.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జిల్లా కోర్టు ఆవరణలో ఒక పెద్ద టూత్‌బ్రష్‌ను త్రాసులా మార్చి, దానిపై ఇద్దరు ప్రధాన పాత్రధారులు వెన్ను వెన్నుకు ఆనుకుని కూర్చున్నట్లుగా ఈ విజువల్ ఉంది. ఈ వినూత్నమైన పోస్టర్ సినిమా కథపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా నటిస్తుండగా, ప్రజ్వల్, గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఉదయ్ చౌహాన్ ఈ చిత్రానికి కథను అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సాంకేతిక విభాగంలో వినోద్ కె. బంగారి సినిమాటోగ్రఫీని, పవన్ సీహెచ్ సంగీతాన్ని అందిస్తున్నారు. క్షితిజ్ జీవన్ రంధీర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.