45 ఏళ్ల ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2027లో ఆటగాడిగా కొనసాగుతారా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. ప్రముఖ జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ వ్యాఖ్యల ప్రకారం, వచ్చే సీజన్‌లో ధోనీని మైదానంలో ఆటగాడిగా చూడటం కష్టమని తెలుస్తోంది.
అయితే, ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీకి పూర్తిగా దూరమయ్యే అవకాశం లేదు. ఆటగాడిగా కాకుండా జట్టు సపోర్ట్ స్టాఫ్‌లో లేదా మెంటార్ వంటి కీలక బాధ్యతల్లో ఆయనను కొనసాగించే అంశంపై చర్చ జరుగుతోంది. ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించిన ధోనీ అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని ఫ్రాంచైజీ భావిస్తోంది.
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రస్థానం ముగియడంతో, కొత్త కోచ్ నియామకంపై యాజమాన్యం దృష్టి పెట్టింది. కొత్త కోచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ధోనీ పాత్రపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
వచ్చే సీజన్ వేలానికి ముందు రిటెన్షన్స్, ఆటగాళ్ల విడుదల వంటి ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంది. ఈ మార్పులన్నీ పూర్తయిన తర్వాతే ధోనీ ఏ హోదాలో సీఎస్‌కేతో కొనసాగుతారనే దానిపై స్పష్టత రానుంది.








