హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన బిజెపి డాక్టర్స్ సెల్ ప్రత్యేక కార్యక్రమంలో ఎన్. రాంచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ఆరోగ్య రంగానికి ప్రధాని నరేంద్ర మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్రం వేల కోట్ల రూపాయలను కేటాయిస్తోందని, జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాల నిర్వహణకు అవసరమైన నిధులను అందిస్తోందని ఆయన వివరించారు.
కోవిడ్ సమయంలో భారత్ బయోటెక్ స్వదేశీ వ్యాక్సిన్ తయారీకి ప్రధాని మోడీ అందించిన ప్రోత్సాహాన్ని ఆయన గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ’స్వస్థ్ భారత్’ నిర్మాణానికి పునాది వేసిందని, ఖేలో ఇండియా, అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచాయని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వైద్య సలహాలను నమ్మి ప్రజలు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని, అర్హులైన వైద్యుల సూచనలను మాత్రమే పాటించాలని ఆయన సూచించారు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వద్ద అమర వీరులకు రాంచందర్ రావు నివాళులర్పించారు. యువతలో జాతీయ భావం పెంపొందాలని, రాష్ట్రీయతతోనే దేశ ప్రగతి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ దేశం జాతీయ భావం, అధునాతన వైద్య విధానాలు, సైనిక శిక్షణతో ప్రపంచంలో శక్తివంతంగా ఎదిగిందని ఆయన ఉదాహరణగా చెప్పారు. సమాజ ఆరోగ్య రక్షణలో వైద్యులు చేస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడుతూ, వారికి ఆయన అభినందనలు తెలిపారు.








