ఆఫ్గనిస్తాన్‌లోని కునార్, పక్తిక ప్రావిన్స్‌ల (రాష్ట్రాల)పై పాకిస్తాన్ వరుసగా వైమానిక దాడులకు దిగుతోంది. గత వారం జరిగిన ఈ దాడుల్లో పలువురు సాధారణ పౌరులు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా జరిగింది.

పాకిస్తాన్ చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది పాకిస్తాన్ ఆధిపత్య ధోరణికి, ఆక్రమణకు నిదర్శనమని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మంగళవారం స్పష్టం చేశారు. యుద్ధ నీతికి విరుద్ధంగా పౌరులను, వారి నివాసాలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన విమర్శించారు.

పాక్ దాడుల్లో మరణించిన ఆఫ్గన్ పౌరులకు రణధీర్ జైశ్వాల్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పొరుగు దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా పాకిస్తాన్ దాడులకు దిగడం వల్ల ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు.

ఆఫ్గనిస్తాన్ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతకు భారత్ ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని జైశ్వాల్ ఉద్ఘాటించారు. ఆఫ్గన్ ప్రజల సంక్షేమం కోసం భారత్ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ తీరుపై ఆఫ్గనిస్తాన్‌ను పాలిస్తున్న తాలిబన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌పై ప్రతి దాడులకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు.