సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ వివాహంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. గ్రీస్ దేశంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ — అంటే సొంత ఊరు కాకుండా వేరే ప్రాంతంలో లేదా దేశంలో జరిపే వివాహం — జరగనుందని ప్రచారం సాగుతోంది.
అయితే ఈ వార్తలపై అటు అనిరుధ్ గానీ, ఇటు కావ్య మారన్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో కూడా వీరిద్దరి రిలేషన్‌షిప్ గురించి ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ, ఎవరూ స్పందించలేదు.
అనిరుధ్ బంధువైన నాటక రచయిత వైజీ మహేంద్రన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనిరుధ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని చెప్పారు. అయితే ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరును మాత్రం వెల్లడించలేదు. దీంతో వధువు కావ్య మారనే అని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు.
ప్రస్తుతం అనిరుధ్ రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్ 2', షారుఖ్ ఖాన్ సినిమా 'కింగ్' వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు కావ్య మారన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తూ వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు.








