అసలైన పనీర్ కేవలం పాలతో తయారవుతుంది. కానీ, అనలాగ్ పనీర్‌లో పాల ఘనపదార్థాలతో పాటు వెజిటబుల్ ఫ్యాట్స్ (వృక్ష సంబంధిత కొవ్వులు), స్టార్చ్, ఎమల్సిఫయర్లు (ఆహార పదార్థాలు కలిసి ఉండేలా చేసే రసాయనాలు), స్టెబిలైజర్లు వంటివి కలుపుతారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం నిల్వ ఉండేలా వీటిని తయారు చేస్తారు.
తాజా పనీర్‌తో పోలిస్తే అనలాగ్ పనీర్‌లో ప్రోటీన్ తక్కువగా, కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇందులో వాడే పామ్ ఆయిల్ వంటి వెజిటబుల్ ఫ్యాట్స్ వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక ప్రాసెసింగ్ వల్ల ఇందులో సోడియం స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది.







