గురువారం రాత్రి అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 618 డల్లాస్-ఫోర్ట్ వర్త్ నుండి నెవార్క్‌కు బయలుదేరింది. విమానం గమ్యస్థానానికి చేరువవుతుండగా, 67 ఏళ్ల ఆర్థర్ లేన్ లుండీన్ అనే ప్రయాణికుడు తోటి ప్రయాణికులపై దాడికి దిగి, అసభ్య పదజాలంతో దూషించాడని సాక్షులు తెలిపారు. విమాన సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించగా, అతను మరింత దూకుడుగా ప్రవర్తించి సిబ్బందిని, పక్కనే ఉన్న ప్రయాణికులను కొట్టాడు.

ఈ క్రమంలో తోటి ప్రయాణికులు రంగంలోకి దిగి లుండీన్‌ను అదుపు చేశారు. అతడిని సీటుకు డక్ట్ టేప్ (వస్తువులను అతికించే బలమైన టేప్)తో చుట్టి, మణికట్టును జిప్ టైస్‌తో (ప్లాస్టిక్ లాక్) బంధించారు. ఈ ఘటనతో విమానాన్ని బాల్టిమోర్‌కు మళ్లించాల్సి వచ్చింది.

విమానం బాల్టిమోర్‌లో దిగిన వెంటనే మేరీల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ పోలీసులు లుండీన్‌ను విమానం నుండి దించి అరెస్టు చేశారు. మిగిలిన ప్రయాణికులు ఆ తర్వాత నెవార్క్‌కు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) — అమెరికాలో నేరాలను దర్యాప్తు చేసే ప్రధాన సంస్థ — విచారణ జరుపుతోంది.

కోర్టు రికార్డుల ప్రకారం, లుండీన్ సెకండ్-డిగ్రీ దాడి మరియు క్రమరహిత ప్రవర్తన వంటి నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. సాక్షులను ఇంటర్వ్యూ చేస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు FBI అధికారులు వెల్లడించారు.

మరోవైపు, ఈ ఘటనపై లుండీన్ పనిచేస్తున్న టక్సన్ ఆధారిత లాంగ్ రియాల్టీ కంపెనీ స్పందించింది. లుండీన్ తమ సంస్థలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా, మాజీ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నాడని, అయితే ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే అతనితో సంబంధాన్ని ముగించుకున్నామని కంపెనీ ఆదివారం ప్రకటించింది. కంపెనీ ఆశించే వృత్తి నైపుణ్యానికి, ఇతరుల పట్ల గౌరవానికి లుండీన్ ప్రవర్తన విరుద్ధమని వారు పేర్కొన్నారు.