తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేసిన అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద సోమవారం ఉదయం 11:35 గంటలకు ఈ ఘటన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన మహేష్ అనే భక్తుడు భద్రతా తనిఖీల సమయంలో తన వద్ద ఉన్న బంగారు ఆభరణాల బ్యాగును అక్కడే మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయాడు.

అక్కడే విధులు నిర్వహిస్తున్న టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఆ బ్యాగును గమనించి స్వాధీనం చేసుకున్నారు. బ్యాగును తెరిచి చూడగా అందులో సుమారు 100 గ్రాముల బరువున్న బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడం ప్రారంభించారు.

సీసీటీవీ పుటేజీ ఆధారంగా బ్యాగు యజమానిని గుర్తించిన సిబ్బంది, ఆయనను విజిలెన్స్ కార్యాలయానికి పిలిపించారు. అప్పటివరకు తాను బ్యాగును మర్చిపోయిన విషయాన్ని కూడా గమనించని భక్తుడు మహేష్‌కు, అధికారులు ఆభరణాలను భద్రంగా అప్పగించారు. తన విలువైన బంగారాన్ని తిరిగి పొందిన భక్తుడు, టీటీడీ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ సిబ్బంది నిజాయితీని, వారి అంకితభావంతో కూడిన సేవలను ప్రత్యేకంగా అభినందించారు.