రాష్ట్రంలో ఐవీఎఫ్ (IVF) కేంద్రాల ముసుగులో జరుగుతున్న అక్రమాలు, దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అండాల అక్రమ సేకరణ ముఠాతో సంబంధాలున్న ప్రైవేట్ ఐవీఎఫ్ సెంటర్లను శాశ్వతంగా మూసివేయాలని (సీజ్) అధికారులను ఆయన ఆదేశించారు.
కోఠిలోని టీజీఎంఎస్ఐడీసీ (TGMSIDC) కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, కమిషనర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పాల్గొన్నారు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన అండాల సేకరణ ముఠా కేసులో సమగ్ర విచారణ జరపాలని మంత్రి పోలీసులను కోరారు. ఈ కేసులో దోషులుగా తేలే వారికి కఠిన శిక్షలు పడేలా సహకరించాలని అధికారులకు సూచించారు. అక్రమాలకు పాల్పడిన డాక్టర్ల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేసేలా స్టేట్, నేషనల్ మెడికల్ కౌన్సిల్స్తో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు.
సరోగసి (అద్దె గర్భం), అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ART - సంతానోత్పత్తికి తోడ్పడే సాంకేతికత) చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ చట్టాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు.
ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి, అదనపు మార్గదర్శకాలను రూపొందించాలని ప్రిన్సిపల్ సెక్రటరీని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.








