హైదరాబాద్ అజామాబాద్ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సుమారు రూ. 500 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఈ భూమిని కేవలం రూ. 87 కోట్లకే కట్టబెట్టడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు లేఖ రాశారు.
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘ఆయిల్‌ఫెడ్’ సదరు రూ. 87 కోట్లు చెల్లించి ఆ భూమిని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం దానిని పక్కన పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తోందని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఆయిల్‌ఫెడ్‌కు చెందిన 3.23 గుంటల భూమిని కాపాడాలని, ఆ భూమిని సదరు సంస్థకే దక్కేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఏజెన్సీలా వ్యవహరిస్తోందని హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ శక్తులకు ధారాదత్తం చేసే చర్యలను వెంటనే నిలిపివేయాలని ఆయన కోరారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే, ప్రజాక్షేత్రంలోనే కాకుండా న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు.







