మెగా డీఎస్సీ నిర్వహణపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి డిమాండ్ చేశారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ ఆరోపణలను నిరూపించాలని లేదా బహిరంగ చర్చకు రావాలని వైసీపీని సవాల్ చేశారు.
వైసీపీ నేతలు చర్చకు రాకపోతే తానే స్వయంగా వారి కార్యాలయానికి వస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ కార్యాలయానికి బయలుదేరడంతో ఆదోనిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే వస్తున్నారన్న సమాచారంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
పరిస్థితిని గమనించిన పోలీసులు అప్రమత్తమై వైసీపీ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలు ఎదురుపడకుండా పోలీసులు పర్యవేక్షించి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
డీఎస్సీ ప్రక్రియను ఎమ్మెల్యే నిర్వహించలేదని, ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలోనే జరిగిందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పార్థసారథి తీరు సరికాదని విమర్శించిన వారు, ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ విమర్శలు మానుకోవాలని సూచించారు.








