విజయనగరం జిల్లా దేవపల్లికి చెందిన తేజస్విని (25), బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. ఉద్యోగంలో ఎదురైన తీవ్ర ఒత్తిడి కారణంగా ఆరు నెలల క్రితం ఆమె రాజీనామా చేశారు. అనంతరం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వచ్చి, రెండు నెలలుగా తల్లి అరుణతో కలిసి పీర్జాదిగూడ శంకర్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
శుక్రవారం సాయంత్రం ఇల్లు మారే పనిలో భాగంగా తల్లితో కలిసి మియాపూర్ వెళ్లిన తేజస్విని, రాత్రికి ఇంటికి చేరుకుని నిద్రపోయారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఆమె నిద్రలేచి, తల్లి ఉన్న గదికి బయట నుంచి తాళం వేశారు. ఆపై నగ్నంగా వీధిలోకి వెళ్లి పరుగెత్తారు. ఈ క్రమంలో స్థానిక బీరప్ప ఆలయం వద్ద ఆమె ఆగినట్లు సీసీటీవీ దృశ్యాల్లో రికార్డైంది.
అనంతరం పీర్జాదిగూడ చెరువు వద్దకు చేరుకున్న తేజస్విని అందులోకి దూకారు. ఉదయం తలుపులు తెరుచుకోకపోవడంతో తల్లి కేకలు వేయగా, స్థానికులు వచ్చి తలుపులు తీశారు. కుమార్తె కనిపించకపోవడంతో గాలించగా, ఆమె చెరువులో శవమై కనిపించారు. మృతురాలు ఫియర్ ఫోబియాతో బాధపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై తల్లి అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.








