ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వద్ద విధులు నిర్వహిస్తున్న 41 ఏళ్ల కానిస్టేబుల్ గణేశ్ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. విధుల్లో ఉండగా ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తోటి పోలీసులు వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. 2024లో సల్మాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన తర్వాత అక్కడ బందోబస్తును మరింత కట్టుదిట్టం చేశారు. 1990లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణజింకలను వేటాడారనే ఆరోపణలు కూడా ఈ బెదిరింపులకు కారణంగా చెబుతుంటారు.
తనకు కల్పిస్తున్న భద్రతపై సల్మాన్ ఖాన్ గతంలో స్పందించారు. భారీ భద్రత మధ్య జీవించడం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, ఈ బెదిరింపులకు తాను భయపడనని, తన భద్రత దేవుడి చేతుల్లోనే ఉందని ఆయన పేర్కొన్నారు.







