వికారాబాద్ నియోజకవర్గంలోని కామారెడ్డిగూడ గ్రామంలో గత సంవత్సరం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.8 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ఆరు నెలల్లోనే పగుళ్లు ఏర్పడ్డాయి. అదేవిధంగా బురాన్‌పల్లి గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన రోడ్డు ఎనిమిది నెలల్లోనే పగిలిపోయింది.

రోడ్ల నాణ్యత తక్కువగా ఉండటం, ప్రజాధనం దుర్వినియోగం వంటి కారణాలతో ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులపై మండిపడుతున్నారు. ధన్నారం నుంచి కామారెడ్డిగూడ వరకు రోడ్డు మంజూరు అయినప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో ప్రజల్లో నిరాశ పెరుగుతోంది.

మదన్‌పల్లి గ్రామంలోని రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల పునర్నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.