షాబాద్‌లో పోక్సో కేసు నిందితుడు ఆరుగురి ప్రాణాలు తీసిన ఘటనపై స్థానికులు, బాధితుల బంధువులు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు ముందస్తు బెయిల్‌ పొందేందుకు అవసరమైన సమయం కొనివేసేందుకు పోలీసులు రెండు లక్షల రూపాయల లంచం స్వీకరించారని వారు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

బాధితురాలిని నిందితుడు రాజ్‌కుమార్‌ ఏడాది కాలంగా వేధిస్తూ, సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచాడని, ఆమె కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించినా పోలీసులు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. ప్రాణభయం ఉందని మొరపెట్టుకున్నా, నిందితుడిని స్టేషన్‌కు పిలిపించి విచారించకపోగా, భయంతో వచ్చిన వారిని పోలీసులు వెటకారంగా నవ్వి పంపించారని విమర్శలు వస్తున్నాయి.

కేసు నమోదు చేసినప్పుడే పోలీసులు తక్కువ తీవ్రత గల సెక్షన్ల కింద (బీఎన్‌ఎస్‌ 78, 351(1), పోక్సో చట్టం 2012లోని సెక్షన్లు 11, 12తో పాటు) చార్జీలు మోపారని, దీంతో ఏడేండ్లలోపు శిక్ష పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిందితుడు గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు ప్రశ్నించలేదంటే, లంచంలో కొంత మొత్తం వారికి కూడా చేరిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసుల ఈ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ షాబాద్‌లోని ప్రధాన రహదారిపై బాధిత కుటుంబాలు, స్థానికులు ఆందోళన బాట పట్టారు. పోలీసుల తీరు వల్లే ఈ హత్యలు జరిగాయని, పరోక్షంగా అధికారులే బాధ్యులని ఆరోపిస్తూ నిరసన తెలుపుతున్నారు.