గత రెండేళ్ల కాలంలో అశ్లీల కంటెంట్‌ను ప్రదర్శిస్తున్న 50 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పలు చట్టాలను ఉల్లంఘించినట్లు గుర్తించిన తర్వాతే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
ఈ ప్లాట్‌ఫామ్‌లపై అందిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. 1986 నాటి చట్టాలతో పాటు ఇతర నిబంధనలను ఈ ఓటీటీలు అతిక్రమించినట్లు మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ న్యూస్ మరియు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై వచ్చే ఫిర్యాదులను ఐటీ రూల్స్- 2021 కింద పరిష్కరిస్తున్నామని ఆయన వివరించారు.
ఓటీటీల్లో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించమని మధ్యవర్తులను ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంది. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే, ఫిర్యాదుల ఆధారంగా ఇటువంటి ప్లాట్‌ఫామ్‌లపై క్రమం తప్పకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.







