రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్త నాలెడ్జ్‌ సిటీ సెంటర్‌ పరిధిలో ఉన్న 83/1 సర్వే నంబర్‌లోని 10 ఎకరాల భూమిని విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో 5.25 ఎకరాలు మరియు 5.38 ఎకరాల చొప్పున రెండు భాగాలుగా విభజించి, టీజీఐఐసీ (TG IIC) ద్వారా వేలం వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టు 1న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎకరాకు రూ. 237 కోట్ల చొప్పున మొత్తం రూ. 2500 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మైనారిటీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల ముందు వక్ఫ్ భూములను కాపాడతామని ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు వాటిని అమ్మకానికి పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మసీదులు, ఉర్దూ యూనివర్సిటీ, ఉర్దూ అకాడమీకి చెందిన భూములను కూడా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని వారు విమర్శిస్తున్నారు.

గతంలో మౌలనా అబుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైంది. తాజాగా దర్గా హుస్సేన్ షావలీ గ్రామంలోని 1.04 ఎకరాల భూమిని ప్రైవేట్ కంపెనీకి లీజుకు ఇచ్చేందుకు జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 22ను, మైనారిటీ సంఘాల ఒత్తిడితో ప్రభుత్వం నిలిపివేసింది. అయితే, ఇప్పుడు జామియా నిజామియా భూముల వేలంపై మైనారిటీ సంఘాలు మండిపడుతున్నాయి.

ఈ వేలం ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని మైనారిటీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే భూముల పరిరక్షణ కోసం త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తామని, ఢిల్లీ తరహా పోరాటానికి సిద్ధమవుతామని వారు హెచ్చరిస్తున్నారు.