బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో గురువారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లండ్ జట్టు భారత్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 3-0తో ఆధిక్యంలో నిలిచి సిరీస్‌ను గెలుచుకుంది. చివరి మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను కోల్పోయి నిరాశకు గురైంది.

ఈ మ్యాచ్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికైన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ జట్టు ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో బలమైన జట్లలో ఒకటైన భారత్‌ను 3-0తో ఓడించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆటగాళ్లందరూ సమిష్టిగా రాణించారని, మ్యాచ్ ఎంతో సరదాగా సాగిందని తెలిపాడు.

విజయ రహస్యాన్ని వివరిస్తూ.. తమకు లోతైన బ్యాటింగ్ లైనప్ ఉందని, బ్రిస్టల్ మైదానంలో బౌండరీలు చిన్నగా ఉండటంతో బ్యాటింగ్‌పై దృష్టి పెట్టామని బ్రూక్ చెప్పాడు. ఆటగాళ్లు, కోచ్‌ల మధ్య సమన్వయం, పిచ్‌కు తగ్గట్టుగా ఆడే విధానంపై నిరంతర చర్చలే విజయానికి కారణమని అన్నాడు. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ బౌలింగ్‌లో అద్భుతంగా రాణించారని, వికెట్‌కీపర్ జోస్ బట్లర్ స్పిన్నర్లకు కీలక సూచనలు ఇచ్చి జట్టుకు ఉపయోగపడ్డాడు.

ప్రపంచ నంబర్ వన్ టీ20 జట్టుగా మారడమే తమ తదుపరి లక్ష్యమని హ్యారీ బ్రూక్ స్పష్టం చేశాడు. ప్రస్తుత విధానాన్నే కొనసాగిస్తూ, చివరి మ్యాచ్‌లోనూ గెలిచి 4-0తో సిరీస్‌ను ముగించాలని తాము ఆశిస్తున్నామని ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు భారత్ జట్టు చివరి టీ20లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.