బంగారం ధరలు పెరగడంతో పాటు, సిబిల్ స్కోర్ అవసరం లేకుండానే వేగంగా డబ్బులు అందడం వల్ల గోల్డ్ లోన్లకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. పిల్లల చదువులు, వ్యాపారం లేదా అత్యవసర అవసరాల కోసం ఇంట్లోని బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందుతున్నారు. కానీ ఈ లోన్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యం.
మీ దగ్గర ఉన్న బంగారం ధరను బట్టి రుణ పరిమితిని బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఎక్కువ బంగారం తాకట్టు పెడితే ఎక్కువ లోన్ వస్తుంది కానీ, అవసరమైనదాని కంటే ఎక్కువ రుణం తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే వడ్డీ భారం పెరిగి, తిరిగి చెల్లించే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అర్హత, అవసరాన్ని బట్టి మాత్రమే లోన్ తీసుకోవడం మంచిది.
గోల్డ్ లోన్పై బ్యాంకులు సాధారణంగా 8 నుంచి 11 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తాయి. బ్యాంకును బట్టి ఈ రేట్లు మారుతూ ఉంటాయి. కేవలం వడ్డీ మాత్రమే కాకుండా, ప్రాసెసింగ్ ఫీజు, ఆభరణాల విలువ నిర్ధారణ ఛార్జీలు, పునరుద్ధరణ ఫీజులు, ఆలస్య చెల్లింపు జరిమానాలు వంటి అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. ఈ ఛార్జీల గురించి ముందే తెలుసుకోవడం తప్పనిసరి.
నెలవారీ ఈఎంఐ రూపంలోనో లేదా ఒకేసారి డబ్బులు చెల్లించి బంగారాన్ని విడిపించుకోవచ్చు. మీ ఆదాయం, ఖర్చులను బట్టి ఏ పద్ధతి ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి. అలాగే, నిర్ణీత తేదీకి ముందే రుణాన్ని తిరిగి చెల్లిస్తే ఏవైనా అదనపు ఛార్జీలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి.








