వచ్చే ఏడాది అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు పురుషుల వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి మొత్తం 14 జట్లు అర్హత సాధించాయి. మొత్తం 54 మ్యాచ్‌ల తర్వాత విజేత ఎవరో తేలనుందని ఐసీసీ గురువారం వెల్లడించింది.

స్టేడియాల నాణ్యత, మౌలిక వసతులు, ప్రేక్షకుల ఆదరణను పరిగణనలోకి తీసుకుని ఐసీసీ వేదికలను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్, సెంచూరియన్, కేప్‌టౌన్, డర్బన్, కెబెర్హ, బ్లొఎమ్‌ఫొంటెన్, పార్ల్, కుగుపో సిటీలలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఎనిమిది నగరాల్లోనే సింహభాగం మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

జింబాబ్వేలోని హరారే, బులవాయో, విక్టోరియా ఫాల్స్ నగరాల్లో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. నమీబియాలోని విండ్‌హోక్ నగరం కూడా ఈ ప్రపంచకప్ వేదికల్లో ఒకటిగా నిలిచింది. ఈ 12 నగరాల్లో క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐసీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.