నమిత్ మల్హోత్రా నిర్మాణంలో, నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రామాయణం సినిమా రూపొందుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం గురించి ఢిల్లీలో జరిగిన ప్రథమ్ సంకల్ప్ వేడుకలో సాయి పల్లవి మాట్లాడారు.
సీతాదేవి వంటి పవిత్రమైన పాత్రలో నటించే అవకాశం రావడం తన పూర్వ జన్మ సుకృతమని ఆమె పేర్కొన్నారు. ఈ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేందుకు తాను నిరంతరం ధ్యానం చేస్తూ, ఆలోచనలను పవిత్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించానని చెప్పారు. సీతాదేవే తన ద్వారా ఈ పాత్రను నటింపజేయాలని తాను ప్రార్థించేదాన్నని ఆమె భావోద్వేగంతో తెలిపారు.
ఈ సినిమా ప్రయాణంలో తాను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని సాయి పల్లవి వెల్లడించారు. భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి చిత్ర బృందం ఎంతో కష్టపడుతోందని ఆమె వివరించారు.







