తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్సర్స్ అసోసియేషన్ మరియు ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య వివాదం ముదిరింది. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఫిల్మ్ ఫెడరేషన్ మరియు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా సహాయ నిరాకరణ ప్రకటించాయి. ఈ నిర్ణయంతో టాలీవుడ్‌లోని మిగిలిన 23 క్రాఫ్ట్స్ కూడా డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు సహకరించవని ఫెడరేషన్ స్పష్టం చేసింది.
మెగాస్టార్ చిరంజీవి సూచనలను, అలాగే ఫిల్మ్ ఛాంబర్ మరియు ఫెడరేషన్ తీసుకున్న ఉమ్మడి నిర్ణయాలను సుమలత ధిక్కరించారని ఫెడరేషన్ ఆరోపించింది. గతంలో సస్పెండ్ అయిన సభ్యులను కలుపుకుని వెళ్లాలని కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించినప్పటికీ, సుమలత సారథ్యంలోని కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఫెడరేషన్ లేఖలో పేర్కొంది. గతంలో ఈ కమిటీకి ఒక అవకాశం ఇచ్చినప్పటికీ, పెద్దల మాటను లెక్కచేయకుండా ముందుకు వెళ్లడంపై ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నిర్ణయం అమలులోకి వచ్చినప్పటి నుండి డ్యాన్సర్స్ అసోసియేషన్ పరిధిలోని ఆర్థిక వ్యవహారాలు, సమస్యలు లేదా వివాదాల పరిష్కారంలో ఫెడరేషన్ ఎటువంటి బాధ్యత వహించదు. ఫిల్మ్ ఛాంబర్‌తో జరగబోయే వేతన సవరణ ఒప్పందాలు మరియు ఇతర అధికారిక చర్చల్లో కూడా డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఫెడరేషన్ మద్దతు ఉండదు.
ఫెడరేషన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వల్ల భవిష్యత్తులో షూటింగ్‌లలో డ్యాన్సర్ల భాగస్వామ్యంపై మరియు వేతన ఒప్పందాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అంతర్గత విభేదాలు మరియు ఎన్నికల వివాదాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం, టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.








