ఏటా 2 లక్షల ఉద్యోగాల కల్పన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను, విద్యార్థులను మోసం చేసిందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తన యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని విమర్శించారు. ఈ సమావేశంలో పటోళ్ల కార్తిక్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, తలసాని సాయికిరణ్, కే. వాసుదేవ రెడ్డి, కె. కిషోర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ నెల 18న సరూర్‌నగర్ స్టేడియంలో 'యువ సంగ్రామ సదస్సు' నిర్వహిస్తున్నట్లు కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగాల కల్పనతో పాటు ఫీజు రియింబర్స్‌మెంట్ విషయంలోనూ ప్రభుత్వం యువతను తప్పుదోవ పట్టించిందని ఆయన పేర్కొన్నారు. తమ హయాంలో 2 లక్షల 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, 10 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించామని ఆయన గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బిఆర్‌ఎస్‌పై విషం చిమ్ముతోందని పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆరోపించగా, ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ముఖ్యమంత్రి, మంత్రులకే స్పష్టత లేదని ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తలసాని సాయి కిరణ్ యాదవ్ తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి మెడకు ఉరి తాడుగా మారిందని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి యువత సిద్ధంగా ఉన్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, యువత తమ బలం చూపించాలని బిఆర్‌ఎస్ నేతలు పిలుపునిచ్చారు.