కర్నూలు జిల్లా గోనెగండ్లలో భూమి సర్వే వ్యవహారం వివాదాస్పదమైంది. రెవెన్యూ అధికారుల ఏకపక్ష నిర్ణయాలు, అన్యాయంపై మనస్తాపం చెందిన ఈరమ్మ (77) ఐదు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నిన్న మరణించింది.
అధికారులు అవతలి వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించడం వల్లే తమకు అన్యాయం జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు, రజక సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ, మృతదేహాన్ని అంబులెన్స్‌లో తహసీల్దార్ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి ధర్నా చేసేందుకు వారు సిద్ధమయ్యారు.
ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు, ఆందోళనకారులు కార్యాలయం వైపు రాకుండా మార్గమధ్యలోనే అంబులెన్స్‌ను నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన బంధువులు కర్నూలు-ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై నిరసన తెలిపేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని, మృతదేహాన్ని బలవంతంగా ఆమె నివాసానికి తరలించారు.
ప్రస్తుతం గోనెగండ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.







