రైలులో ప్రయాణించేటప్పుడు మద్యం బాటిళ్లను బ్యాగుల్లో దాచుకుని తీసుకెళ్లే ప్రయాణికులు చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఇండియన్ రైల్వేస్ చట్టం ప్రకారం, నిబంధనలు ఉల్లంఘించి మద్యం తరలిస్తే రూ.10,000 వరకు జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష పడవచ్చు. కొన్ని సందర్భాల్లో జరిమానా, జైలు శిక్ష రెండింటినీ కూడా విధించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
రైలులో మద్యం తీసుకెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం నేరుగా నిషేధం విధించలేదు, కానీ ఈ బాధ్యతను ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలకు (మద్యం అమ్మకాలు, రవాణాను పర్యవేక్షించే ప్రభుత్వ విభాగం) అప్పగించింది. దీనివల్ల మీరు ప్రయాణించే మార్గంలోని రాష్ట్రాల ఎక్సైజ్ చట్టాలే అక్కడ అమల్లో ఉంటాయి. బీహార్, గుజరాత్, నాగాలాండ్, లక్షద్వీప్ వంటి సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న ప్రాంతాల మీదుగా మీ రైలు వెళ్తుంటే, అక్కడ మద్యం బాటిళ్లు పట్టుబడితే అరెస్ట్ కావడం ఖాయం.
మద్యం అనుమతి ఉన్న రాష్ట్రాల మీదుగా ప్రయాణించేటప్పుడు మాత్రమే వ్యక్తిగత అవసరాల కోసం మద్యం తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుంది. అయితే, ఒక ప్రయాణికుడు గరిష్టంగా రెండు లీటర్ల మద్యం మాత్రమే తనతో ఉంచుకోవాలి. ఈ బాటిళ్లు కచ్చితంగా కంపెనీ సీల్ ప్యాకింగ్‌తో ఉండాలి; ఒకవేళ బాటిల్ మూత తీసి ఉన్నా లేదా ఖాళీ బాటిళ్లు వెంట ఉన్నా రైల్వే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు.
రైల్వే స్టేషన్ ఆవరణలో గానీ, నడుస్తున్న రైలు కంపార్ట్‌మెంట్లలో గానీ మద్యం సేవించడం చట్టరీత్యా పూర్తిగా నిషేధం. బహిరంగంగా మద్యం తాగుతూ పోలీసులకు దొరికితే ఎటువంటి మినహాయింపు ఉండదు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రైల్వే చట్టాలు, ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తారు.
ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు మీ రైలు ఏయే రాష్ట్రాల మీదుగా వెళ్తుందో రూట్ మ్యాప్ సరిచూసుకోవడం చాలా ముఖ్యం. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, సంతోషంగా సాగాల్సిన ప్రయాణం జైలు గడప తొక్కేలా మారుతుందని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు.







