హైదరాబాద్ పరిసరాల్లోని వేలాది ఎకరాల అసైన్డ్ భూములను (ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూములు) తక్కువ ధరకు కాజేసేందుకు కొత్త దందా మొదలైందని బీజేపీ శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ పేరుతో ఈ అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు.

ప్రభుత్వం రూ.33 వేల కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురయ్యాయని చెబుతోందని, అలాంటప్పుడు వాటిని ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ భూ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో (ప్రస్తుతం పదవిలో ఉన్న న్యాయమూర్తి) విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

గత ఆరు రోజులుగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై సమయాన్ని వృథా చేశాయని ఏలేటి ఆరోపించారు. సభలో తాము అవినీతిపై గళమెత్తుతుంటే మంత్రులు మైకులు కట్ చేయిస్తూ తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

చివరి రోజున 22ఏ నిషేధిత జాబితా (రిజిస్ట్రేషన్లకు వీలులేని భూముల జాబితా)పై చర్చ సందర్భంగా మంత్రి నాలుగు గంటల పాటు మాట్లాడారని, అయితే 50 లక్షల మంది రైతులు, పేదలకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఆయన విమర్శించారు. 22ఏ సెక్షన్లను కోర్టు నిర్ణయించిందని మంత్రి చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఏలేటి అన్నారు.

చట్టాలు చేసేది చట్టసభలు, జీవోలు (ప్రభుత్వ ఉత్తర్వులు) ఇచ్చేది ప్రభుత్వమే తప్ప కోర్టులు కావని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరుగుతున్న ఈ నాటకాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.