ఎల్‌నినో ప్రభావం వల్ల భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ హెచ్చరించారు. శుక్రవారం మెదక్ ఐడీవోసీ కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో ఆమె ఈ మేరకు స్పష్టం చేశారు. భూగర్భ జలాలు అడుగంటి పంట నష్టం జరగకుండా ఉండేందుకు రైతులు సంప్రదాయ సాగు పద్ధతులను వీడాలని ఆమె కోరారు.

బోరుబావుల ద్వారా వరి సాగు చేయవద్దని కలెక్టర్ రైతులకు సూచించారు. దీనికి బదులుగా తక్కువ కాలంలో చేతికి వచ్చే మిల్లెట్స్, పప్పుదినుసులు, కూరగాయలు మరియు పామాయిల్ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ఆమె ఆదేశించారు. కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని ఆమె గుర్తు చేశారు.

అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని, ఇందుకోసం బిందు, తుంపర సేద్యం పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయాధికారులు నిరంతరం రైతులకు అందుబాటులో ఉండి, తగిన సలహాలు అందించాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్‌వో అంబాదాస్, రాజేశ్వర్, జిల్లా ఉద్యానవన అధికారి ప్రతాప్‌సింగ్ పాల్గొన్నారు.