కాకినాడ జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యనారాయణ, కాకినాడ కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఉన్న ఐఏఎస్ కమిషనర్‌ను ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో విభేదాల కారణంగా తొలగించాక, సత్యనారాయణ ఈ బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయన తన అసలు బాధ్యత అయిన హౌసింగ్ పనుల కంటే కమిషనర్ హోదాలోనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

గత ప్రభుత్వంలో ఆర్డీవోగా పనిచేసిన సత్యనారాయణకు, అప్పటి వైసీపీ నేతలతో ఉన్న పరిచయాలు ఇప్పుడు ఎమ్మెల్యేకు కలిసి వస్తున్నాయని సమాచారం. టెండర్లు లేకుండానే పనులు అప్పగించడం, బిల్డింగ్ నిర్మాణ అనుమతుల్లో ఎమ్మెల్యే మనుషుల జోక్యం వంటి వ్యవహారాలను కమిషనర్ స్మూత్‌గా చక్కబెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంపై కమిషనర్ పనితీరుపై చంద్రబాబు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మందలించినప్పటికీ, తన పనులను సులభంగా పూర్తి చేస్తున్నారనే కారణంతో సత్యనారాయణనే ఇంచార్జ్ కమిషనర్‌గా కొనసాగించాలని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు పట్టుబడుతున్నారు.