తెలంగాణలో విద్యుత్ సరఫరా వైఫల్యాలపై బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్‌తో కలిసి హరీశ్‌రావు గురువారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 7,180 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, బుధవారం కేవలం 3,190 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరిగిందని ఆయన తెలిపారు. కొత్తగూడెం, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి పవర్ స్టేషన్లలో ఆరేడు రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవని, యాదాద్రిలో యూనిట్-1, 4 నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు.

సింగరేణి వెబ్‌సైట్‌ను మూసివేసి బొగ్గు నాణ్యత, సరఫరా వివరాలను ప్రభుత్వం దాస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. నాణ్యమైన బొగ్గును తమిళనాడు, కర్ణాటక, ఏపీకి తరలిస్తూ, రాష్ట్రానికి మాత్రం నాణ్యత లేని బొగ్గును పంపిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కరెంట్ లోడ్ 15వేల మెగావాట్లు మాత్రమే ఉన్నా, సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు. దీంతో 11 జిల్లాల్లో రైతులు సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలకు దిగుతున్నారని గుర్తుచేశారు.

రుణమాఫీ, రైతు భరోసా, ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. సీతారామ, దేవాదుల ప్రాజెక్టులను కేసీఆర్ నిర్మించారని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మోటర్లను స్విచ్ ఆన్ చేసిందని ఆయన స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని, ఇప్పుడు కరెంట్ కోతలతో పల్లె, పట్నం తేడా లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులు రాత్రివేళల్లో చదువుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని, త్రీఫేస్ కరెంట్ కోసం రైతులు పొలాల్లో జాగారం చేస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్లే రాష్ట్రం మళ్లీ చీకట్లలోకి వెళ్తోందని ఆయన విమర్శించారు.