ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన పట్టును పెంచుకునేందుకు ఏథర్ ఎనర్జీ సిద్ధమైంది. ఇందులో భాగంగా కంపెనీ అత్యంత చౌకైన 'ఏథర్ కోనార్క్' స్కూటర్‌ను ఆగస్టు 29న మార్కెట్లోకి తీసుకురానుంది. ఏథర్ అభివృద్ధి చేసిన కొత్త EL ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైన తొలి ప్రొడక్షన్ మోడల్ ఇదే కావడం విశేషం.
ఈ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే, హ్యాండిల్‌బార్‌పై హెడ్‌ల్యాంప్, ముందు భాగంలో పూర్తి వెడల్పుతో ఉండే LED DRLs, పెద్ద ఫ్లోర్‌బోర్డ్ మరియు పొడవైన సింగిల్-పీస్ సీటును ఇందులో అమర్చారు. పాలిమర్ బాడీకి బదులుగా మెటల్ బాడీ ప్యానెల్స్‌ను ఉపయోగించడం ద్వారా దీనిని మరింత బలంగా, మన్నికగా తయారు చేసినట్లు సమాచారం. టాప్ వేరియంట్లలో అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
ఏథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా తెలిపిన వివరాల ప్రకారం, ఈ కొత్త EL ప్లాట్‌ఫామ్‌ను తక్కువ నిర్వహణ ఖర్చు, ఈజీ ఛార్జింగ్, మెరుగైన రీసేల్ విలువ మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. మాస్ మార్కెట్ విభాగంలోకి బలంగా అడుగుపెట్టాలనే లక్ష్యంతో కంపెనీ ఈ మోడల్‌ను తీసుకొస్తోంది.
ప్రస్తుతం ఈ స్కూటర్ ధర రూ. 1 లక్ష లోపే ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, అధికారిక ధరను మాత్రం స్కూటర్ విడుదల చేసిన తర్వాతే కంపెనీ ప్రకటించనుంది.







