జనగామ జిల్లాలో వానాకాలం సీజన్ మొదలై నెల రోజులు దాటినా, ఇప్పటివరకు సరైన వర్షాలు కురవలేదు. దీంతో జిల్లాలోని చెరువులు, కుంటలు ఎండిపోతుండగా, భూగర్భ జలమట్టం ఏకంగా 14.80 మీటర్ల లోతుకు పడిపోయింది. గతంలో 80 ఫీట్ల లోతులోనే లభించిన నీరు ఇప్పుడు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

నీటి వసతి లేక వరి నారు మడులు ఎండిపోతుండగా, పత్తి విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి. మొలకెత్తిన పత్తి పంటను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. దేవరుప్పుల, కొడకండ్ల, జనగామ, బచ్చన్నపేట, రఘునాథపల్లి, లింగాలఘనపురం, నర్మెట, చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్‌, జఫర్‌గడ్‌ మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

దేవాదుల ఎత్తిపోతల పథకంపై ఆధారపడిన ఈ ప్రాంతంలోని బొమ్మకూరు, నవాబుపేట, ఆర్‌ఎస్‌ ఘన్‌పూర్‌, అశ్వరావుపల్లి జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. గతంలో ఈ ప్రాజెక్టుల ద్వారా పంటలకు సాగునీరు అందేదని, ఇప్పుడు ఆ ఆశలు సన్నగిల్లాయని రైతులు చెబుతున్నారు. వర్షాలు పడకపోవడంతో దున్నకాల పనులు కూడా నిలిచిపోయాయి.

మరో వారం లేదా పది రోజుల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతే, పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటితో పాటు తాగునీటి సమస్య కూడా తీవ్రరూపం దాల్చుతోంది.