రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సృష్టించిన ఆరు హత్యల కేసులో కీలక ఆధారం లభ్యమైంది. హంతకుడు రాజ్‌కుమార్ ప్రాణాలు తీసుకోవడానికి కొద్ది గంటల ముందు తన మొబైల్‌లో రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో పోలీసుల చేతికి చిక్కింది. నిందితుడి మృతదేహం దొరికిన ప్రాంతంలోనే ఆయన ఫోన్ కూడా లభించిందని, అందులోనే ఈ వీడియో ఉందని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు.
జూలై 10న సాయంత్రం 4:55 గంటల సమయంలో రాజ్‌కుమార్ ఈ వీడియోను రికార్డ్ చేశారు. తన సంపాదనలో సగం ఖర్చు చేశానని, పెద్ద మొత్తంలో డబ్బు లాగేసి తనను రోడ్డున పడేశారని ఆయన వాపోయారు. తనను నమ్మించి అప్పులపాలు చేశారని, చివరకు తన పిల్లలకు భూమి కూడా లేకుండా చేశారని, తనపైనే కేసు పెట్టి జైలుకు పంపారని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
నమ్మిన వారే తనను ముంచి, జైలుకు పంపారనే కక్షతోనే రాజ్‌కుమార్ ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నెల 10న షాబాద్ టౌన్‌లో ఒక మైనర్ బాలిక తల్లి, నాయనమ్మలను చంపిన ఆయన, తర్వాత తన భార్యాపిల్లలను హత్య చేశారు. ఆ మైనర్ బాలికను కారులో తీసుకెళ్లి అఖిల్ సాగర్ చెరువు వద్ద గొంతుకోసి చంపేశారు.
ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. పోలీసులు నిందితుడి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టగా, చివరకు రాజ్‌కుమార్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ప్రస్తుతం లభ్యమైన మొబైల్ ఫోన్ మరియు వీడియోను సైన్స్ అండ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, పూర్తి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని సీపీ తరుణ్ జోషి తెలిపారు.







