సిద్దిపేట జిల్లా మర్కూక్‌లో శుక్రవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ ఆందోళనలో రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు లేకపోవడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, రిజర్వాయర్లను నింపడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లు నిండుగా ఉండేవని, ఇప్పుడు నీటి కొరతతో అవి వెలవెలబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. సాగునీటితో పాటు తాగునీటి సమస్యలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రైతు వ్యతిరేక విధానాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. 'కొండపోచమ్మ-మల్లన్నసాగర్ నింపాలి-రైతులను కాపాడాలి' అంటూ నినాదాలు చేస్తూ వారు నిరసన తెలిపారు. సాగునీరు తమ హక్కు అని, అది సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ చందనా రవి, వివిధ మండలాల బీఆర్‌ఎస్ అధ్యక్షులు, మాజీ చైర్మన్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే రిజర్వాయర్లలో నీటిని నింపే చర్యలు చేపట్టాలని వారు కోరారు.