సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని రామారం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన నలుగురు ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ శనివారం (జులై 18) సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో స్కూల్ అసిస్టెంట్లు పి. కోటయ్య, కే. సుజాత, జి. గీతతో పాటు ఎస్జీటి కే. శ్రీనివాస్ నాయుడు ఉన్నారు. అంతకుముందే ఇదే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.ఏ. హకీంను జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేయడం గమనార్హం.
ఈ పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య సున్నాకు పడిపోవడంతో అధికారులు విచారణ చేపట్టారు. గ్రామంలో పాఠశాల వయసున్న పిల్లలు ఉన్నప్పటికీ, హైస్కూల్ విభాగంలో విద్యార్థులు లేకపోవడానికి ఉపాధ్యాయుల ప్రవర్తనే కారణమని విచారణలో తేలింది. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు లేవని తప్పుడు సమాచారం ఇచ్చి, విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు, హాస్టళ్లకు వెళ్లేలా ఈ ఉపాధ్యాయులు ప్రోత్సహించినట్లు అధికారులు గుర్తించారు.
పాఠశాల సిబ్బంది మధ్య సమన్వయం లోపించడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, రికార్డుల నిర్వహణలో విఫలం కావడం వంటి కారణాలతో పాఠశాల గౌరవానికి భంగం వాటిల్లింది. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం వీరు బేఖాతరు చేసినట్లు అధికారులు నిర్ధారించారు. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించి పాఠశాలకు తీరని లోటు కలిగించినందుకే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.







