రాత్రి పడుకునే ముందు గదిలో లైట్లు ఆపి, గంటల తరబడి సోషల్ మీడియా లేదా వార్తలను స్క్రోల్ చేయడం వల్ల మెదడు నిరంతరం అప్రమత్త స్థితిలో ఉంటుంది. దీనివల్ల శరీరం విశ్రాంతి తీసుకోలేక, లోతైన నిద్రకు అవసరమైన ప్రశాంతతను కోల్పోతుంది. పరిశోధనల ప్రకారం, పడుకునే ముందు ప్రతి గంట స్క్రీన్ వినియోగం నిద్రలేమి ప్రమాదాన్ని సుమారు 59 శాతం వరకు పెంచుతుంది.
డిజిటల్ పరికరాల నుంచి వెలువడే బ్లూ లైట్ శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో నిద్ర పట్టడం ఆలస్యమై, నిద్ర చక్రం దెబ్బతింటుంది. అంతేకాకుండా, ప్రతికూల సమాచారాన్ని నిరంతరం చూడటం వల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్ స్థాయిలు పెరిగి, మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ప్రతి అదనపు గంట స్క్రీన్ వినియోగం వల్ల సగటున 24 నిమిషాల నిద్ర తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు.
చీకటి గదిలో ప్రకాశవంతమైన స్క్రీన్‌ను చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి, మైగ్రేన్ తలనొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ అలవాటును తగ్గించుకోవడానికి పడుకునే 30 నుంచి 60 నిమిషాల ముందే మొబైల్, టీవీ వంటి స్క్రీన్‌లను నిలిపివేయాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రివేళ తప్పనిసరిగా ఫోన్ వాడాల్సి వస్తే బ్లూ లైట్ ఫిల్టర్ లేదా నైట్ మోడ్ ఆన్ చేసుకోవడం మంచిది.
డూమ్ స్క్రోలింగ్‌కు బదులుగా పుస్తకాలు చదవడం, పాడ్‌కాస్ట్‌లు వినడం లేదా ధ్యానం, శ్వాస వ్యాయామాలు వంటి విండ్‌డౌన్ రొటీన్‌ను పాటించడం వల్ల మెరుగైన నిద్ర లభిస్తుంది. ఈ చిన్న జీవనశైలి మార్పుల ద్వారా మైగ్రేన్, నిద్రలేమి వంటి సమస్యల ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.








