తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలమట్టం ప్రస్తుతం సగటున 9.34 మీటర్ల లోతుకు చేరుకుంది. గత వేసవిలో ఈ మట్టం 6.22 మీటర్లు ఉండగా, వర్షాలు కురవకపోవడం, రిజర్వాయర్లు అడుగంటడంతో నీటిమట్టం రోజురోజుకూ క్షీణిస్తోంది. ముఖ్యంగా 13 జిల్లాల్లో భూగర్భజలాలు 10 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు పడిపోవడం సమస్య తీవ్రతను చాటుతోంది.

గోదావరి బేసిన్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. కృష్ణాబేసిన్‌తో పోలిస్తే ఇక్కడ నీటిమట్టం గత ఏడాది కంటే గణనీయంగా తగ్గింది. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నిజాంసాగర్‌, సింగూరు తదితర ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోసి చెరువులు నింపేవారు. అయితే, మేడిగడ్డ డ్యామేజీ పేరిట నీటి ఎత్తిపోతలు ఆగిపోవడంతో చెరువులు, చెక్‌డ్యామ్‌లు అడుగంటున్నాయి.

హనుమకొండ, జనగామ, సిద్దిపేట మినహా గోదావరి బేసిన్‌లోని మిగిలిన అన్ని జిల్లాల్లో ఈ ఏడాది నీటిమట్టం లోతుకు పడిపోయింది. చెరువులు, కాలువల ద్వారా 10 శాతానికి పైగా భూగర్భజలాల రీచార్జ్ జరగాల్సి ఉండగా, నీటి సరఫరా లేకపోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీనికితోడు బోర్ల ద్వారా అధికంగా నీటిని తోడడంతో నిన్నమొన్నటివరకు నిండుగా ఉన్న బావులు ఇప్పుడు మొరాయిస్తున్నాయి.

జలరంగ నిపుణుల ప్రకారం, ప్రభుత్వం బరాజ్‌ల నుంచి నీటిని ఎత్తిపోసి చెరువులు, ప్రాజెక్టులు నింపితేనే పరిస్థితి అదుపులోకి వస్తుంది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే, భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.