హైదరాబాద్ కమిషనరేట్ సిసిఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) స్పెషల్ క్రైం టీం మరియు హబీబ్‌నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, అక్రమంగా నిల్వ చేసిన మందులను పట్టుకున్నారు. ఈ ఘటనలో రూ.10 లక్షల విలువైన 77,700 ట్యాబ్లెట్లు, 170 సిరప్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ శనివారం ఈ వివరాలను వెల్లడించారు.
మల్లేపల్లి, అఫ్జల్‌సాగర్, మాంగర్‌బస్తీ ప్రాంతాలకు చెందిన మహ్మద్ సర్వర్ అలియాస్ రహీమ్, మహ్మద్ రబ్బానీలను పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు జమ్ము భాయ్, మహధారి, వీర్ధారి, ఇచ్ఛాధారి, అమన్ లాల్ మరియు బీదర్‌కు చెందిన కోహినూర్ అనే మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు కర్ణాటకలోని బీదర్ నుంచి నిట్రాజోమ్ ట్యాబ్లెట్లు, చోకో కాఫ్ సిరప్‌లను కొనుగోలు చేసి, నగరంలో అనుమతి లేకుండా విక్రయిస్తున్నారని గుర్తించారు.
వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సిన ఈ మందులను యువకులు దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. వీటిని వాడటం వల్ల నిద్రలేమి, ఛాతి నొప్పి, రక్తనాళాల సడలింపు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, అధికంగా సేవించినప్పుడు మత్తు, తలతిరగడం, గుండె వేగం పెరగడం వంటి దుష్ప్రభావాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మందుల మత్తులో యువకులు నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.
పరారీలో ఉన్న ఆరుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియను పోలీసులు కొనసాగిస్తున్నారు.






