పశ్చిమాసియాలో మూడు నెలల క్రితం మొదలైన యుద్ధం, దేశంలో వర్షాభావ పరిస్థితులు సామాన్యుడి బతుకుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
గత నెలలో టమాటా, ఎండుమిర్చి వంటి కూరగాయలతో మొదలైన ధరల పెరుగుదల, ఇప్పుడు బియ్యం, పప్పులు, ఉల్లి, అల్లం, వెల్లుల్లి వరకు విస్తరించింది. స్థానిక కిరాణా వ్యాపారుల లెక్కల ప్రకారం, గత నెలలో క్వింటాల్‌కు రూ. 1,300 ఉన్న బియ్యం ధర ప్రస్తుతం రూ. 1,600కు చేరుకుంది. దీనికి తోడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల రవాణా వ్యయాన్ని మరింత పెంచింది.
జీతాలు పెరగకపోయినా, నిత్యావసరాలతో పాటు ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, వైద్య ఖర్చులు, కరెంటు బిల్లులు భారంగా మారుతున్నాయని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల తిరిగేసరికి వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోవడం లేదని వారు వాపోతున్నారు.
ఈ ధరల పెరుగుదల వల్ల నలుగురు సభ్యులున్న ఒక చిన్న కుటుంబంపై నెలకు సుమారు రూ. 2,500 అదనపు భారం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక పరిస్థితులు మధ్యతరగతి కుటుంబాలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.







