బెంగళూరులో ఏడాదికి రూ.11 లక్షల జీతం పొందుతున్న ఒక యువకుడు, కార్పొరేట్ కెరీర్‌ను పక్కనబెట్టి సొంత ఊరిలో వ్యాపారవేత్తగా మారాడు. అంకిత్ పాండే అనే వ్యక్తి ఎక్స్ (X) వేదికగా తన స్నేహితుడికి సంబంధించిన ఈ విషయాన్ని పంచుకున్నారు. ప్రమోషన్ల కోసం వెంపర్లాడటం కంటే, సొంతంగా ఏదైనా సాధించాలనే లక్ష్యంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు.

సొంత స్థలంలోనే వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, స్థానికంగా ఉన్న 300 ఇళ్లు, దుకాణాలకు తాగునీటి క్యాన్లను సరఫరా చేయడం ప్రారంభించాడు. రోజుకు 300 క్యాన్లను ఒక్కొక్కటి రూ.30 చొప్పున విక్రయిస్తూ, రోజుకు రూ.9 వేల చొప్పున నెలకు రూ.2.7 లక్షల టర్నోవర్‌ను సాధిస్తున్నాడు. సొంత స్థలం కావడంతో అద్దె భారం లేకపోవడం అతనికి కలిసివచ్చింది.

నీటి శుద్ధి, విద్యుత్ ఖర్చులకు నెలకు రూ.15 వేలు, రవాణాకు రూ.20 వేలు ఖర్చు అవుతోంది. ఈ ఖర్చులన్నీ పోను నెలకు రూ.2.35 లక్షల నికర లాభం వస్తుందని అంకిత్ పాండే తెలిపారు. అంటే ఏడాదికి రూ.28.5 లక్షల ఆదాయం వస్తోంది, ఇది అతను గతంలో చేసిన ఉద్యోగ జీతం కంటే రెట్టింపు.

ప్రజల నిత్యవసర సమస్యకు పరిష్కారం చూపే వ్యాపారం అద్భుతమైన అవకాశాలను అందిస్తుందని అంకిత్ పాండే అభిప్రాయపడ్డారు. ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో స్వచ్ఛమైన తాగునీటికి డిమాండ్ పెరుగుతోందని, ఈ రంగంలో పెట్టుబడులు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తాయని నెటిజన్లు ఈ పోస్టుపై స్పందిస్తున్నారు.