నల్లగొండ జిల్లా పెద్దవూర గ్రామానికి చెందిన మంజుల అనే మహిళ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం హయత్‌నగర్‌లోని నీలాద్రి ఆస్పత్రికి వచ్చింది. శస్త్రచికిత్సకు ముందు వైద్యులు ఆమెకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చారు.

ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే మంజుల ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. చికిత్స వికటించడం వల్లే ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మంజుల ప్రాణాలు కోల్పోయిందని వారు ఆస్పత్రి వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.