వనపర్తి జిల్లా పెబ్బేరులోని సుభాష్ చంద్రబోస్ క్రాస్ రోడ్స్ సమీపంలో ఉన్న ఒక ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 28, 2025న ఒక దళిత బాలిక మరణించింది. కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఆ బాలిక, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ బాలిక వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామంలోని దళిత కాలనీకి చెందిన రాముడు, శిరీష దంపతుల కుమార్తె.
ఈ ఘటన తర్వాత ఆసుపత్రి యాజమాన్యం, మధ్యవర్తుల సమక్షంలో మృతదేహం వద్దే సెటిల్మెంట్లు కుదుర్చుకుంటున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇలాంటి సెటిల్మెంట్ల వల్ల వైద్య నిర్లక్ష్యం బయటపడకుండా, చట్టపరమైన చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెబ్బేరులోని ప్రైవేటు ఆసుపత్రుల్లో వరుసగా జరుగుతున్న మరణాలు, వైద్య సమస్యలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఆసుపత్రుల తీరుపై వస్తున్న ఈ ఆరోపణలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.







