కాలేయం మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడం, విషపదార్థాలను తొలగించడం, కొలెస్ట్రాల్ నియంత్రణ వంటి కీలక పనులను చేస్తుంది. మనం తీసుకునే ఆహారంలోని కార్బొహైడ్రేట్లు, కొవ్వులు అవసరానికి మించి ఉన్నప్పుడు అవి కాలేయంలో నిల్వ అవుతాయి. కాలేయం బరువులో 5 నుంచి 10 శాతానికి పైగా కొవ్వు పేరుకుపోతే దాన్ని ఫ్యాటీ లివర్‌గా పరిగణిస్తారు. ఆల్కహాలిక్, నాన్-ఆల్కహాలిక్ అని ఇది రెండు రకాలుగా ఉంటుంది.
ఈ సమస్యను ప్రారంభ దశలో గుర్తిస్తే జీవనశైలి మార్పులతో పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ప్రాసెస్డ్ ఫుడ్స్, మైదా, తెల్ల చక్కెర, మద్యం వంటి వాటిని పూర్తిగా మానేయడం లేదా తగ్గించడం చాలా ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలు, ఆలివ్ ఆయిల్, చేపలు ఉండే మెడిటరేనియన్ ఆహార విధానం కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. తీసుకునే కేలరీలను నియంత్రించడం ద్వారా శరీర శక్తికి, ఆహారానికి మధ్య సమతుల్యతను పాటించవచ్చు.
ఆహారంలో వెల్లుల్లి, కాఫీ, బ్రోకలీ, పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలను చేర్చుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే గ్రీన్ టీ కూడా ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది. పాస్తా వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.
ఫ్యాటీ లివర్ పరిస్థితి ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరూ ఒకే రకమైన ఆహార ప్రణాళికను పాటించడం సాధ్యం కాదు. కాబట్టి, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి సరైన చికిత్స, ఆహార నియమాల కోసం వైద్య నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.







