రాగిలో ఉండే ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. మైదా లేదా తెల్ల సేమియాతో పోలిస్తే, రాగి సేమియా పాయసం బరువు పెరగకుండా కాపాడటమే కాకుండా, పీచు పదార్థం ద్వారా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ రుచికరమైన పాయసాన్ని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు.
ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో ఒక టీస్పూన్ నెయ్యి వేసి, 250 గ్రాముల రాగి సేమియాను చిన్న మంటపై ఐదు నిమిషాల పాటు దోరగా వేయించాలి. అందులో 500 మి.లీ నీళ్లు పోసి, సేమియా నీటిని పూర్తిగా పీల్చుకునే వరకు ఉడికించాలి. ఆ తర్వాత ఒక లీటరు పాలు, ఒక టీస్పూన్ యాలకుల పొడి, చిటికెడు జాజికాయ పొడి వేసి బాగా కలపాలి. పాలు మరిగే వరకు ఉంచి, మంట తగ్గించి 15 నిమిషాల పాటు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.
పాయసం చిక్కబడుతున్న సమయంలో 500 మి.లీ కొబ్బరి పాలు పోసి మరో పొంగు వచ్చే వరకు ఉంచాలి. అనంతరం అర కప్పు చక్కెర, చిటికెడు ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేయాలి. చివరగా చిన్న మూకుడులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి, నాలుగు టేబుల్ స్పూన్ల జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు మరియు రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేయించి పాయసంలో కలపాలి.
ఈ పద్ధతిలో తయారైన రాగి సేమియా పాయసాన్ని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ చల్లగా తినాలనుకుంటే, ఫ్రిజ్‌లో పెట్టుకుని కూడా రుచి చూడవచ్చు.







